Tuesday, 20 October 2026

స్వేచ్ఛ 🦚 - ఒక పేరు కాదు… తన ఉనికిని తాను నిర్ణయించుకునే హక్కు..! 🕊️

 


ఆడది అంటే అలుసా? 

ఆడదానికి 'స్వేచ్ఛ' ఇచ్చి చూసావా?

కాళ్ళు చూడకు, కాళ్ళకి మెట్టలు చూడకు,

కళ్ళు చూడు, తన కళ్ళల్లో దాచిన కన్నీళ్ళని చూడు

ఆడది కన్పిస్తే రొమ్ము చూడడం నేర్చుకున్నావే,

గుర్తుకులేదా ఆ రొమ్ము పాలు లేనిదే నీ కండలకి బలం ఎలా చేకూరిందో.

ఆడది అంటే అంత అలుసా, అమ్మని సైతం లెక్క చేయవు,

ఆడబిడ్డ అంటే ఆడుకునే బొమ్మ అనుకున్నావా?

ఆడది అంటే ఓ అస్త్రం రా, ముట్టుకుంటే బగ్గుమంటది,పట్టుకోవాలని అడుగేస్తే ప్రళయం సృష్టిస్తది.

ఒక్కసారి గౌరవించి చూడు, నిన్నెప్పుడు తలదించుకునేలా చేయదు

ఇంట్లో అక్క, అమ్మ, చెల్లి ఉంటేనే వాళ్ళ విలువ తెలుస్తది అనుకుంటున్నావా?

ఒక్కసారి అనాథగా పుట్టి చూడు, నీకు అన్ని తానయి చూస్కుంటది

ఆడది మదర్ థెరిసా అంత గొప్ప మనసు కలది రా

అయ్యో నా మతిమండ మదర్ థెరిసా కూడా ఒక ఆడదే కదా!

చందమామని రోజు చూసి మురిసిపోతావే

ఆ చందమామ మీద అడుగేయడానికి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్కే ముప్పై ఏళ్ళు పట్టింది తెలుసా

కానీ 'మన చందమామ' అదే రా మన అమ్మని మాత్రం మనం పుట్టగానే చూసేసామే ..

అందుకేరా అమ్మనైనా ఆ మాటకొస్తే ఏ అమ్మాయినైనా గౌరవించి చూడాలి అనేది

మన దగ్గర ఉన్నప్పుడే వారి విలువని తెలుసుకుందాంరా

అక్కడ ఇక్కడ కాదు రా, నీ అంతరంగం లో చూడు, అమ్మ లేనిదే నీ జన్మ సాధ్యమా!

కడుపులో తొమ్మిది నెలలు మోసి, కన్నీళ్ళను దిగమింగి నీ నవ్వులో తన సంతోషాన్ని చూసి,

తన ఆకలిని చంపుకుని నీ ఆకలి తీర్చి,

తన కలల్ని పక్కనపెట్టి నీ భవిష్యత్తుకి బాటలు వేసి,

నీ గెలుపులో తన జన్మకి అర్ధం వెతుక్కునే ఆడదాన్ని నువ్వు బలహీనురాలిగా ఎలా చూస్తావురా?

నువ్వు పుట్టింది ఆడదాని గర్భంలో, 

నువ్వు పెరిగింది ఆడదాని ఒడిలో, 

నువ్వు నడిచింది ఆడదాని చేయి పట్టుకుని, 

నువ్వు గెలిచింది ఆడదాని ఆశీర్వాదం తోడుండగా!

మరి అదే ఆడదాన్ని అవమానించడానికి నీ మనసెలా ఒప్పుకుంటుందిరా? 

నీకు జన్మనిచ్చిన చేతులనే గాయపరచడానికి నీకు మనసెలా వస్తుందిరా?

ఆడది అబల కాదు రా,

నీ అహంకారానికి తలవంచని ఓ ఆత్మగౌరవం!

ఆడది బలహీనత కాదు రా,

నీ కష్టకాలంలో నీకు కొండంత అండ!


ఆమె నవ్వితే ఇంటికి వెలుగు,

ఆమె ఏడిస్తే ఆ ఇంటికే చీకటి,

ఆమెను గౌరవిస్తే నీ సంస్కారానికి గుర్తు,

ఆమెను కించపరిస్తే నీ మనిషితనానికే మచ్చ!

గుర్తుంచుకో రా మగాడా,

ఆడదాన్ని గౌరవించడం నీ గొప్పతనం కాదు,

ఆమెకు దక్కాల్సిన గౌరవాన్ని ఇవ్వడం నీ బాధ్యత!

ఆమెను కాపాడే ముందు మనిషిగా మారడం నేర్చుకో,

ఆమెను అర్థం చేసుకునే ముందు మనసుతో చూడడం నేర్చుకో,

ఆమె 'స్వేచ్ఛ'ను శాసించే ముందు ఆమెకు కూడా కలలుంటాయని తెలుసుకో!

ఎందుకంటే...

ఆడది నీ పాదాల కింద ఉండాల్సిన మట్టి కాదు,

నీతో పాటు నడవాల్సిన మనిషి!

నీ కామానికి బలయ్యే శరీరం కాదు,

నీ గౌరవానికి భంగం కలిగించని ఒక వ్యక్తిత్వం!

చివరిగా ఒక్క మాట రా మగాడా,

నీకు జన్మనిచ్చిన ఆడదాన్ని పూజించమని అడగడం లేదు,

నీకు జన్మనిచ్చిన ఆడదానిలాగే ప్రతి ఆడదాన్నీ మనిషిగా గౌరవించమని అడుగుతున్నా!

ఎందుకంటే...

అమ్మను దేవతగా కొలుస్తూ, మరో ఆడదాన్ని అవమానిస్తే నీ పూజకు అర్థమేంటిరా?

ఆడదాన్ని గౌరవించలేని నీ చదువెందుకు?

ఆడదాని కన్నీటిని తుడవలేని నీ హోదా ఎందుకు?

ఆడదానికి భద్రతనివ్వలేని నీ సమాజం ఎందుకు?

ఆమెకు 'స్వేచ్ఛ'నివ్వు, తన కలల్ని ఎగరనివ్వు,

ఆమెకు గౌరవమివ్వు, తన జీవితాన్ని బతకనివ్వు!

'స్వేచ్ఛ' ఆమె హక్కు, దయగా ఇచ్చే కానుక కాదు

ఆమె అడుగులకు అడ్డుకట్టలు వేయకు,

ఆమె కలలకు ఆకాశం ఇవ్వు

ఆమెను కాపాడటం కాదు,

ఆమె నిర్ణయాలను గౌరవించు

ఆమెకు కావాల్సింది పెద్ద వరం కాదు,

తన జీవితాన్ని తనలా బతికే చిన్న 'స్వేచ్ఛ' ..

ఆడది లేకపోతే జననం లేదు,

ఆడదానికి గౌరవం లేకపోతే మానవత్వానికి అర్థం లేదు!

మాతృభాష మన భావాలకు తొలి ఊపిరి,

మాతృభూమి మన అడుగులకు తొలి నేల

అలాగే ఆడది మన జీవితానికి తొలి వెలుగు

ఆమెను గౌరవించని హృదయానికి, తనని "ప్రేమించే హక్కు" ఎక్కడిది?

ఇది ముందు తెలుసుకో.

సరే మరి నాకు పరిచయమైన 'స్వేచ్ఛ' గురించి కాసేపు తెలుసుకుందామా?

తన కోసం మొదటగా రాసిన 'కావ్య'ము ఇది.. నా 'గొంతుకని' సరి చేసి మరి రాసాను..

తనకి నచ్చాలి అని కాదు, తన మీద ఉన్న అభిమానాన్ని కాస్త అర్ధమయ్యే భాషలో చెప్పాలి అనుకున్నా అంతే ..

తన కలలకే రంగులద్దుకుంటూ, తన ఇష్టమే దారిగా సాగిపోయే 'స్వేచ్ఛ' ..

ఎవరి ఆంక్షలూ లేవు, తన ఆశలకు హద్దులూ లేవు ..

తన రెక్కల బలమేంటో తెలిసిన 'పక్షి'లా ఆకాశాన్నంటుతోంది ..

తన అడుగులకు 'కుటుంబమే అండ'గా, తన 'ఆశయాల'కు నా 'స్నేహమే' తోడుగా నిలుస్తోంది .. అని చెప్పడానికి ఏదో ఒక చిన్న ప్రయత్నం అంతే ..

బంధాలున్నాయి కానీ బంధనాలు లేవు, అందరి ప్రేమ ఉంది కానీ ఆంక్షలు లేవు ..

తన 'పేరు'లోనే కాదు, తన ప్రతి ఆలోచనలోనూ 'స్వేచ్ఛ'గా జీవిస్తోంది! 🦚🫰🕊️

                          - ©️®️ ✍️Mr.VRites

No comments:

Post a Comment